Popular Posts

Thursday, June 4, 2020

No Title (నో టైటిల్ )






మీరు చదివింది కరెక్టే. ఈ కథకి నో టైటిల్. 
నమ్మండి, నిజంగానే నో టైటిల్. 

ఇవాల తాడో పేడో తేలిపోవాలి. ఎలాగైనా రాసేయాల్సిందే, అనుకుంటూ కుర్చీని
బల్లకు దగ్గరగా లాగి కుర్చున్నాడు లింగం. 
ఎంతో మంది రచయితలే నాకు స్పూర్తి. ఆ స్పూర్తి తోనే ఇవాల నాలోని రచయిత ని ఆవిష్కరిస్తా అన్నాడు లింగం. 

“ఏడిసావ్ లే” అంది బల్లమీద పేపరు. 

“నువ్వు ఊరుకోవే.. నిజంగానే ఇవాల ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు మన బాసు.” అన్నాడు పెన్ను గాడు. 

లింగం: “తెల్లగా వున్నానని పొగర్రా దానికి” 

పెన్ను : “దాని మాటలు పట్టించుకోకు బాసూ, దాని తెల్ల మొహం నల్లబోయేలా రాయి.” 

లింగం : “ రాస్తా... ఇవాల చాలా బలంగా రాయాలని గట్టిగా డిసైడయిపోయాను. ”

పేపరు: “ అంత సులువు కాదమ్మా రాయడం.” 

 లింగం: “అసలు రాయడం పెద్ద కష్టమే కాదబ్బా..ఎవ్వడైనా రాయగలడు. ఎటువంటి వాడైనా సరే రాయాలి అనుకుంటే దేని గురించైనా రాసిపడేయొచ్చు. ఆవగింజంత ఆలోచనుంటే చాలు, అక్షరాలు వాటికవే తన్నుకొచ్చేస్తాయి.” 

మళ్ళీ లింగం: “ పైగా ఈ మధ్య నే కొన్ని పుస్తకాలు కూడా పిచ్చ పిచ్చ గా తిరగేసాను. కాబట్టి ఈజీ గా రాసిపడేస్తా” 

పేపరు: “అబ్బో.. ఇదేదో తేడా యవ్వారం లానే వుంది. పుస్తకాలు చదివితే రాసేయొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ తీరా నా ముందొకొచ్చేసరికి అక్షరాలు తన్నుకుంటూ రావడం కాదు కాదా, కనీసం ఒక్క అక్షరం ముక్క కూడా కుంటుకుంటూ అయినా రాదు.” 

పెన్ను గాడు: “బాసూ.. టూమచ్ చేస్తుంది. ఎంతోకొంత రాయించు నాతో.”

లింగం: “ ఎంతోకొంత ఏంట్రోయ్,  మినిమమ్ ఒక కట్ట పేపర్లు రాస్తాను అని ఫిక్సయ్యి వచ్చాను. “ 

పెన్ను గాడు: “ సూపర్ బాసూ, నేను కూడా కొత్త రీఫిల్ తగిలించుకుని వచ్చా. నువ్వు సింపుల్ గా ఏదోకటి రాసిపడేయ్”

పేపరు: “ సింపుల్ గా నా? అంతలేదు” 

లింగం: “ రాయడం చలా సింపులే. మన మది లో ఏం అనుకుంటున్నామో, దానిని పెన్నుతో పేపరు మీద పెట్టడమే. అంటే నీకు కూడా కనపడని నీ మనసుని బయటికి తీసి, అక్షరాల రూపం లో పేపరు మీద ఆరేసుకోవడం”

పేపరు: “ ఆరేసుకోడమా?? వామ్మో బాసూ, కొంచెం తేడా గా అన్పిస్తున్నావ్”

లింగం: “ తేడా ఏవిటే తేడా? మనసు పారేసుకునేవాడు ప్రేమికుడైతే, అదే మనసుని బయటకి తీసి దానికో రూపమిచ్చి ఆరేసుకుంటే కళాకారుడవుతాడు.” 

పెన్నుగాడు : “ఆహా అద్భుతం!! ఏం అర్థం కాలేదుగానీ, భలేగా చెప్పావ్ బాసూ. కేక”

లింగం : “ మ్యాటరేంటంటే, ఎవరు ఏమనుకున్నా నేను అనుకున్నది అనుకున్నట్టు గా పేపరు మీద పెట్టేయాలని నిర్ణయించేసుకున్నా” 

పేపరు: “ఇంతకీ ఏమనుకున్నావ్?”

లింగం: “ అదే సరిగ్గా అంతుచిక్కట్లేదు. నా మదిలో కూడా ఒక అసెంబ్లీ రన్ అవుతూ వుంటుంది. అధికార థాట్ ప్రాసెస్ పార్టీ వాళ్ళు ఏదైనా ఆలోచనా బిల్లు ప్రవేశ పెడితే, వెంటనే అపోజిషన్ థాట్ ప్రాసస్ పార్టీ వాళ్ళు గొడవకి దిగుతారు. ఛీ ఛీ.. ఇదేం బిల్లు అని గోల గోల చేస్తారు. ఇంతలో మైండ్ స్పీకర్ గాడు సైలెన్స్ సైలెన్స్.. ద థింకింగ్ సెషన్ ఈస్ అడ్జర్నడ్ అని వాయిదా వేసేస్తాడు. మొత్తం లైట్ తీస్కుని మది తలుపలు మూసి మీకోదండం రా బాబూ అనుకోవడమే అలవాటైపోయింది రోజూ.”

పేపరు: “ మరి ఉత్త కబుర్లేనా, ఇవాలేమైనా రాసేదుందా?” 

లింగం: “ ఇన్ని మాటలు చెప్పాను కానీ ఇప్పుడు ఏం రాయోలో అర్థం కావట్లేదు. ఇన్సెప్షన్ సినిమా క్లైమాక్సు లో  బిల్డింగులు కూలినట్టు నా రచనాలోచనలు కూలిపడుతున్నాయ్ రా పెన్ను గా.” 

ఇంతలో  వెనుకనుండి
“సార్... అడిషనల్ ప్లీస్” అని పిలుపులు.

లింగం: “వామ్మో టైమయిపోతుంది రా...
అందరూ తెగ రాసేస్తున్నారు.  నాకేమో ఒక్క ముక్క గుర్తొచ్చి చావాట్లేదు.”

పేపరు: “ నేను ముందే చెప్పాను బాస్, మీకంత సీన్ లేదని. ఈసారి కూడా.... ” 

లింగం: “ ఒసేయ్ పేపరు.. ఒక్క మంచి మాట రాదు కదా నీ నోట్లోంచి. చింపి అవతలేసయగలను.” 

పేపరు: “ మీకెందుకు బాస్ శ్రమ. నన్ను దిద్దేవాడు ఎలాగు చేసేది అదే. కనీసం మీ పేరు, రోల్ నంబరైనా రాయండి.” 

పెన్ను గాడు: “ మీరాగండి బాస్. మీ పేపరు మీద మీ పేరు రాస్తే అది కేవలం పేరవుతుంది. అదే ఇతరుల పేపర్ మీద మీ పేరు రాస్తే అది ఆటోగ్రాఫ్ అవుతుంది. “

“ ఒరేయ్ పెన్నుగా.. ఆల్రెడీ ప్రశ్నాపత్రం చూసి కుమిలిపొయ్ వున్నా. ఇలాంటి టైములో పరిహాసమొద్దు రా మొద్దు.” 
కాస్త గ్యాప్ ఇచ్చి.. 
“వామ్మో ఈ క్వొశెనేంటి ఇంత పొడుగ్గా వుంది.” అని కొశెన్ పేపర్ చూస్తూ...ఎంతో మంది రచయితలే నాకు స్పూర్తి. ఆ స్పూర్తి తోనే ఇవాల నాలోని రచయిత ని ఆవిష్కరిస్తా అని మళ్ళీ అందుకున్నాడు లింగం.

పెన్ను: “బాస్ వీళ్ళు చివర్లో టైటిల్ ఏదైనా రివీల్ చేస్తారేమో అని ఇంకా చదువుతున్నారు.” 

లింగం: “ నో టైటిల్.” 

పెన్ను గాడు: “ అదేంటి బాస్. చాలా కథలు టైటిలుంటేనే చదవట్లేదు. మీరేమో...“ 

లింగం: “ అసలు నేను ఏం రాసానని రా? 
కనీసం టైటిల్ కూడా రాయలేదు. వాళ్ళకి అర్థమైంది లే కానీ, నువ్ ముయ్” 

Conceived and Written By,
Jayanth Aluguri

No comments:

Post a Comment